నకరికల్లులో ఆగని మట్టి దోపిడీ: అధికారుల అండతోనే మాఫియా అరాచకాలు?
నకరికల్లులో ఆగని మట్టి దోపిడీ: అధికారుల అండతోనే మాఫియా అరాచకాలు?
నకరికల్లు, (ఆంధ్రప్రభ): నకరికల్లు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా ప్రకృతి సంపదను యథేచ్ఛగా తరలిస్తున్నా పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇటీవల ‘ఆంధ్రప్రభ’లో ప్రచురితమైన కథనం మండలవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
కథనం వెలువడినా తగ్గని జోరు
అక్రమ తవ్వకాలపై ఆధారాలతో సహా వార్తలు వెలువడటంతో అధికారులు స్పందిస్తారని ప్రజలు భావించారు. కానీ, అందుకు భిన్నంగా వార్త వచ్చిన మరుసటి రోజు నుండే మాఫియా మరింత రెచ్చిపోయింది. బుధవారం మండలంలోని పలు కీలక ప్రాంతాల్లో జెసిబిలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. మీడియా హెచ్చరించినా మాఫియా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం వెనుక స్థానిక అధికారుల హామీలు లేదా పరోక్ష సహకారం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
రెవెన్యూ శాఖ వైఫల్యంపై నిరసన
అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు కనీసం ఘటనా స్థలాలను సందర్శించకపోవడం గమనార్హం. మాఫియాకు, అధికారులకు మధ్య ఉన్న “అవినితీ బంధం” కారణంగానే తనిఖీలు చేపట్టడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ దందాపై అధికారులు మౌనం వహించడం వెనుక మతలబు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ జోక్యం కోరుతున్న ప్రజలు
గతంలో జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై అధికారులను హెచ్చరించినప్పటికీ, మండల స్థాయి యంత్రాంగం మాఫియా చేతుల్లో కీలుబొమ్మలుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి, ఈ అక్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రకృతి సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
