యువత కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు

యువత కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు
గంపలగూడెం, ఆంధ్రప్రభ తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. గురువారం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబుతో కలిసి గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, గంపలగూడెం గ్రామాల్లో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎంపీ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా కొనియాడారు.
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని, అదే ఆశయాలను కొనసాగిస్తూ నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మహిళల సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు.
తిరువూరు నియోజకవర్గంలో త్వరలోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (MSME) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే వినగడప–కట్లేరు వంతెన నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
మహానాడు కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యుల పండుగగా అభివర్ణించిన ఎంపీ, కోటి సభ్యత్వంతో తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం క్లస్టర్–1 పరిధిలో 11 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, తెలుగు మహిళలు, గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
