జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాం
జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతాం
- తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం విద్యారంగంతో పాటు క్రీడారంగ అభివృద్ధికీ సమాన ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో అవసరమైన క్రీడా మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (TGSSA) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి సూచించారు.
సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని జనకాపూర్ క్రీడా మైదానాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్, వాలీబాల్, ఫుట్‌బాల్ మైదానాల అభివృద్ధి, క్రీడా మైదానం ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర మరమ్మతు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గిరిజన సంక్షేమ బాలికల క్రీడా పాఠశాలను సందర్శించిన సోనీ బాలదేవి, పీడీలు, పీఈటీలు, శిక్షకులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు క్రీడల్లో నాణ్యమైన శిక్షణ అందించి ప్రతిభను వెలికితీయాలని సూచించారు.
ఇటీవల నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన పీడీలు, పీఈటీలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
