MOVIE DIRECTORS | ‘ధర్మన్’ డైరెక్టర్స్ మార్పుపై రజినీ కామెంట్స్ వైరల్!
MOVIE DIRECTORS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు తెర వెనుక ఎన్నో మార్పులు జరుగుతాయి. తాజాగా తన కొత్త చిత్రం టైటిల్ ప్రకటనలో రజినీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న ‘ధర్మన్’ సినిమాకి దర్శకులు ఎలా మారారో..? అసలు ఈ కథ చివరకు అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా ఎలా ఎంపిక అయ్యారు అనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

మొదట అనుకున్నది కె.ఎస్. రవికుమార్..
ఈ సినిమాకి ముందుగా అనుకున్న దర్శకుడు రవికుమార్. రజినీకాంత్, రవికుమార్ కాంబినేషన్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమాను కూడా రవికుమార్‌తో తీయాలని భావించినట్లు తెలిపారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ కాంబో కుదరలేదని ఆయన అన్నారు.
సుందర్ సి ఎంట్రీ..
ఆ తరువాత ప్రముఖ దర్శకుడు సుందర్ సి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కమర్షియల్ సినిమాలకు పేరుగాంచిన ఆయన కథపై పని చేసినప్పటికీ, ఇతర సినిమాల ఒత్తిడితో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని రజినీ తెలిపారు. దీంతో సుందర్ సి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

సీబీ చక్రవర్తి కథకు ఫిదా..
ఇలా దర్శకులు మారుతున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్‌లోకి యువ దర్శకుడు సీబీ చక్రవర్తి చేరారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చడంతో సినిమా సాధారణ కమర్షియల్ సినిమా కాదని, అణ్వాయుధాల నేపథ్యంలో సాగుతుందని.. అత్యంత సున్నితమైన కథాంశం అని వివరించారు. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ, అణ్వాయుధాలు, అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉండటంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చిత్రబృందం భావించిందట.
అంతేకాకుండా సినిమా పూర్తవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా కనిపించిందని రజనీకాంత్ చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఇతర ప్రాజెక్టులు ఉండటంతో ఈ కథను వెంటనే తెరకెక్కించకుండా భవిష్యత్తుకు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

అప్పుడు రంగంలోకి అశ్వత్ మారిముత్తు
సీబీ చక్రవర్తి ప్రాజెక్ట్ వాయిదా పడిన తర్వాత దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాలోకి వచ్చారని రజనీకాంత్ తెలిపారు. ఆయన తీసుకొచ్చిన కథ, ఆలోచనలు తనకు నచ్చడంతో వెంటనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘ఓ మై కడవులే’ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు, ఇప్పుడు రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రజనీ కామెంట్స్ వైరల్..
ఒక సినిమాకు వరుసగా నలుగురు దర్శకులు మారడం అరుదైన విషయం. అంతేకాకుండా అణ్వాయుధాల నేపథ్యంతో రూపొందించాలనుకున్న భారీ కథను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు రజనీకాంత్ చెప్పడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కూడా లేకపోలేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై సూపర్‌స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
నిర్మాతగా కమల్ హాసన్..
లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో నేరుగా నటించనప్పటికీ, ఆయనకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రజినీకాంత్, కమల్ హాసన్‌ల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమాలో నటి సిమ్రాన్, రాశిఖన్నా కీలక పాత్రల్లో నటించనున్నారు.
