యువత డ్రగ్స్ కు దూరంగా.. లక్ష్యాలకు దగ్గరగా

రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకులు మిరే: జిల్లా ఎస్పీ డా. శబరీష్
విద్యార్థులతో కలిసి గంజాయి వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిన జిల్లా ఎస్పీ
కేసముద్రం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మన ఊరు – మన బాధ్యత కార్యక్రమంలో ఎస్పీ

కేసముద్రం, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాలకు నో… లక్ష్యాలకు యెస్ చెప్పండనీ, రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకులు మిరేనాని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పేర్కొన్నారు. బుధవారం కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపాలిటీ కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన మన ఊరు – మన బాధ్యత కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పాల్గొని విద్యార్థులకు గంజాయి , ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణా మాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. విద్యార్థి దశలో లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా …

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలని, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మరియు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని, ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. సే నో టు డ్రగ్స్- – సే ఎస్ టు లైఫ్ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని కోరారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన సే నో టు డ్రగ్స్ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను సమాజానికి తెలియజేయడంలో యువత ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్
వద్ద విద్యార్థులందరితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ తోటి విద్యార్థులను కూడా చెడు అలవాట్ల బారిన పడకుండా చైతన్యవంతులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ విద్యార్థులు వాల్ ఆఫ్ ప్రామిస్‌ ఫ్లెక్సీ పై సంతకాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.
యువతలో చైతన్యం పెంపొందించడం ద్వారా మాత్రమే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ , ఈగల ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.
గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేయబడుతుందని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొంటూ, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈసందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో వారి వారి వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, ఆగే రాము, వేముల భారతి, కనుకుల సుభద్రలను ఎస్పీ సాల్వతో సత్కరించారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ భానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ అల్లం రామా నాగేశ్వర్ రావు, కౌన్సిలర్ భానోత్ అరుణ, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు రాజు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ , ఈగ మల్లికార్జున, సిఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.