శ్రీరాంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రాణాలు నిలిపిన ఎస్ఐ సతీష్ సమయస్ఫూర్తి
నకరికల్లు, ఆంద్రప్రభ : మండల పరిధిలోని శ్రీరాంపురం బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్ వద్ద చీరాల నుండి హైదరాబాద్ వెళుతున్న సాయి బాలాజీ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు, ముందు వెళ్తున్న లారీని అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చున్న క్లీనర్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, హుటాహుటిన 108 అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే నకరికల్లు ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షణాల వ్యవధిలో పక్కా ప్రణాళికతో సహాయక చర్యలు చేపట్టి పోలీసు శాఖకే వన్నెతెచ్చేలా అంకితభావాన్ని చాటుకున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్లీనర్‌కు తక్షణ వైద్యం అందేలా ఆసుపత్రికి పంపించడంలో ఆయన చూపిన చొరవ ఎంతో అభినందనీయం. అంతేకాకుండా, ఈ ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్ఐ సతీష్ స్వయంగా దగ్గరుండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆపద సమయంలో శరవేగంగా స్పందించి ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ఎస్ఐ సతీష్ పనితీరు, సమయస్ఫూర్తి పట్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
