కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జైల్ భరో
ఖమ్మంలో భారీ ప్రదర్శన.. నాయకుల అరెస్ట్
ఖమ్మం, ఆంధ్రప్రభ : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు.
జైల్ భరో సందర్భంగా పరిషత్ సెంటర్ నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు, సీపీఐ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బీఆర్‌ఎస్ నాయకుడు పగడాల నాగరాజు మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తోందని వారు ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించిందన్నారు. సులభతర వ్యాపారం పేరుతో పెట్టుబడిదారుల లాభాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్‌లుగా తీసుకొచ్చారని విమర్శించారు.
కార్మిక కోడ్‌ల అమలుకు తుది నిబంధనలను ప్రకటించిందని, రోజువారీ పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుకునే అవకాశం యాజమాన్యాలకు కల్పించిందని అన్నారు. సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడంతో పాటు కార్మిక సంఘాల గుర్తింపు, నమోదు ప్రక్రియను కష్టతరం చేశారని ఆరోపించారు.
300 మంది లోపు పనిచేసే సంస్థల్లో కార్మికులను నోటీసు లేకుండా తొలగించే విధానాన్ని తీసుకొచ్చారని, దీనివల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్‌తో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని నాయకులు ఆరోపించారు. 32 దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను ప్రోత్సహించడం వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా లెక్కించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు రాష్ట్రాల వాటాను పెంచడం వల్ల పథకంపై భారం పడుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించేందుకు సమైక్య పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
అంత్యోదయ పథకం కింద ప్రతి కుటుంబానికి అందిస్తున్న 35 కిలోల బియ్యాన్ని కొనసాగించాలని, ఆహార భద్రతా చట్టంలో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ రంగంలో కేంద్రం తీసుకొస్తున్న మార్పుల వల్ల రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని నాయకులు అన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఉచిత విద్యుత్ పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో రైతు డిస్కామ్‌కు అవసరమైన నిధులు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సబ్సిడీ సకాలంలో అందకపోతే రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, సి.వై. పుల్లయ్య, జి. రామయ్య, సింగు నరసింహారావు, తోట రామాంజనేయులు, యర్రా శ్రీనివాస్, మెరుగు సత్యనారాయణ, బోంతు రాంబాబు, మాదినేని రమేష్, వై. విక్రమ్, గోవిందరావు, వెంకన్న, నరాల నరేష్, ఆవుల అశోక్, బీఆర్‌టీయూ నాయకులు పాషా, దండ జ్యోతి రెడ్డి, తొట్టి కొమరయ్య, రాంబాబు, లక్ష్మీనారాయణ, మహిళా సంఘాల నాయకులు శిరోమణి, బండి పద్మ, పి. రమ్య, షకీనా, మోటే కుమార్ తదితరులు పాల్గొన్నారు.
