రాస్తారోకోతో కదిలిన యంత్రాంగం..

మోపిడిలో పునరుద్ధరించిన తాగునీటి సరఫరా

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని మోపిడి గ్రామంలో సత్యసాయి పైప్‌లైన్‌ను అధికారులు ఆదివారం మరమ్మతు చేసి గ్రామంలోని వివిధ కాలనీలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న కళ్యాణదుర్గం–ఉరవకొండ రహదారిపై మహిళలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు సత్యసాయి పైప్‌లైన్‌కు కొత్త గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, మరమ్మతు పనులు పూర్తి చేసి గ్రామానికి తాగునీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి వెంకటేశులు మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే పడమటి కాలనీకి తాగునీటి సరఫరా చేశామని, పంచాయతీ పథకం ద్వారా కూడా ప్రతిరోజు గ్రామానికి నీటి సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ఆయన సూచించారు.