Police Station Siege : మడకశిరలో ఉద్రిక్తత Andhra Prabha Spl News

Police Station Siege : మడకశిరలో ఉద్రిక్తత Andhra Prabha Spl News

  • పోలీస్ స్టేషన్ ముట్టడి
  • జాతర అనుమతికి వాగ్యుద్ధం.
  • సీఐపై ఆరోపణలు
  • శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం

( ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో)

Police Station Siege

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రకచెర్ల పంచాయతీ పరిధిలోని మరవపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున మడకశిర పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి సీఐ సుబ్రహ్మణ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్వహించనున్న మారెమ్మ జాతర సందర్భంగా చెక్కభజన ఊరేగింపు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.

Police Station Siege : ఇదొక ఆనవాయితీ జాతర

Police Station Siege

గ్రామస్తుల కథనం ప్రకారం, మరవపల్లి గ్రామంలో ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహించే మారెమ్మ జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతరలో భాగంగా చెక్కభజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామ పెద్దలు పోలీసుల అనుమతి కోరగా, పోలీసు శాఖ అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం అదే కార్యక్రమానికి సంబంధించి డి. అచ్చంపల్లి ముద్దారంగప్ప అనే వ్యక్తిని మడకశిర సీఐ సుబ్రహ్మణ్యం పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు సమాచారం.

Police Station Siege : చెక్క భజన వివాదం

Police Station Siege

చెక్కభజన నిర్వహణలో ముద్దారంగప్ప ప్రధాన పాత్ర పోషిస్తున్నాడనే కారణంతో అతనిని ప్రశ్నించిన సమయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీఐ అతనిపై దాడి చేయడంతో ముద్దారంగప్ప స్పృహ తప్పి కిందపడిపోయాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది.
దీంతో మరవపల్లి గ్రామానికి చెందిన మహిళలు, యువకులు, పెద్దలు ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలలో పెద్ద సంఖ్యలో మడకశిర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి సీఐ సుబ్రహ్మణ్యంపై నినాదాలు చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. “అనుమతి ఇచ్చి మళ్లీ వేధించడం ఎందుకు?”, “బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police Station Siege : జనాగ్రహం

ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. గ్రామస్తులతో అధికారులు చర్చలు జరిపి శాంతించేందుకు ప్రయత్నించారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Police Station Siege : పోలీసులు ఉక్కిరి బిక్కిరి

ఇక మరోవైపు, పోలీసులు మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జాతర నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతర అనుమతి అంశం చివరకు పోలీస్ స్టేషన్ ముట్టడికి దారితీయడం జిల్లాలో సంచలనంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ALSO READ : పోలీసుల అప్రమత్తతతో భారీ ఫేక్ కరెన్సీ మోసం భగ్నం..

Leave a Reply