ఆగస్టు 4న శతజయంతి ముగింపు వేడుకలు..
- కూటమి నాయకులకు ఎమ్మెల్యే పిలుపు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆగస్ట్ 4వ తేదీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ముగింపు వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు శత జయంతి నిర్వహణ కమిటీల ప్రతినిధులు తెలిపారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ తదితర శత జయంతి కమిటీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వేడుకల గురించి ఆయనతో చర్చించారు. ఆగస్ట్ నాలుగో తేదీ ఉదయం నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, భావదేవరపల్లి, కోడూరు, పులిగడ్డ, మాచవరం, కోసూరువారిపాలెం, టీ.కొత్తపాలెంసహా ఇంకా పలు గ్రామాల్లో ఉన్న ఎంవీ కృష్ణారావు విగ్రహాల వద్ధ శత జయంతి కమిటీల ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది తొలిసారి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో జయంతి వేడుకల నిర్వహణ కమిటీల ప్రతినిధులు, కూటమి నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే జయంతి వేడుకల్లో పాల్గొనాలని కోరారు. తెలుగు భాషకు, ఉప్పెన ప్రభావిత దివిసీమకు కృష్ణారావు చేసిన అనితర సాధ్యమైన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన ఈ గౌరవాన్ని ఇనుమడింప చేసేలా శత జయంతి కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నాలుగో తేదీ సాయంత్రం 5:00గంటలకు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మండలి వెంకట కృష్ణారావు 101వ జయంతి సభ, కృష్ణారావు నూతన కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాలకు శత జయంతి కమిటీల ప్రతినిధులు, కూటమి నాయకులు తరలిరావాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఆయా కమిటీల ప్రతినిధులు తలశిల స్వర్ణలత, మండలి ఉదయ భాస్కర్, మత్తి శ్రీనివాసరావు, ముద్దినేని చంద్రరావు, మర్రె గంగయ్య, బండ్రెడ్డి హరి, తోట శ్రీనివాసరావు, పూతబోయిన సీతారత్న సాయిబాబు, మాదివాడ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల అమెరికాలో పర్యటించి స్వదేశానికి చేరుకున్న తలశిల స్వర్ణలతను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
