రైతు వేదికను ధ్వంసం చేసిన దుండగులు..
- మద్యం సీసాల అడ్డాగా మార్చిన వైనం
దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ఘటన దండేపల్లి మండలం మేదరిపేటలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో రైతు వేదిక తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
భవనంలోకి చొరబడిన దుండగులు అక్కడ మద్యం సేవించినట్లు గుర్తించారు. అనంతరం ఖాళీ మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను ప్రాంగణంలోనే వదిలివెళ్లడంతో రైతు వేదిక అపరిశుభ్రంగా మారింది.

ఆదివారం ఉదయం ఘటనను గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమావేశాలు, వ్యవసాయ కార్యక్రమాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ భవనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించడం సరికాదని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతు వేదికలకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

