పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఆంధ్రప్రభ, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో కొద్దిసేపు మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్‌కు మనోధైర్యం చెబుతూ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను కూడా చంద్రబాబు ఆరా తీశారు. చికిత్స వివరాలు తెలుసుకుని అవసరమైన వైద్య సంరక్షణ అందిస్తున్నందుకు వైద్య బృందాన్ని అభినందించినట్లు సమాచారం. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించగా, ఆయన త్వరలోనే కోలుకుని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
