సాగునీరు వృథా కాకూడదు
చివరి ఆయకట్టుకూ నీరందించడమే లక్ష్యం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాలి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : రైతుల పండించిన ప్రతి పంటకూ సాగునీరు అందాలని, శివారు ప్రాంత భూములకు సైతం ఒక్క నీటిబొట్టు వృథా కాకుండా సాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో నీటి పంపిణీ, కాలువల పరిస్థితి, ఆయకట్టు అవసరాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా రైతులకు అందిస్తున్న సాగునీరు ఎక్కడా వృథా కాకూడదని స్పష్టం చేశారు. నీటి లభ్యతను బట్టి పలాస వరకు ఉన్న ప్రతీ ఎకరాకూ, చివరి భూములకు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరందించేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. “వర్షాలు, ప్రాజెక్టులోకి వచ్చే ఇన్‌ఫ్లోను బట్టి సాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విలువైన మిగులు జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా, వాటిని గరిష్టంగా సాగు అవసరాలకే వినియోగించుకునేలా అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి” అని మంత్రి ఆదేశించారు.
లీకేజీలపై ప్రత్యేక నిఘా..
కాలువల గట్లు బలహీనంగా ఉన్న చోట, తూముల వద్ద నీటి లీకేజీలు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి అధికారులను హెచ్చరించారు. ఎక్కడైనా గండ్లు పడే అవకాశం ఉంటే ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నీటి చౌర్యాన్ని అరికట్టడంతో పాటు, కాలువల వెంబడి ఉన్న పొలాలకు సమన్యాయంగా నీటి పంపిణీ జరిగేలా క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం వహించకుండా పనిచేయాలన్నారు. అన్నదాతలకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, సాగునీటి వినియోగంలో రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని తేల్చి చెప్పారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో బి.ఆర్. వంశధార ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) శేఖర్ బాబు, టెక్కలి, నరసన్నపేట డివిజన్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈలు) శ్రీధర్, శ్రీను, జూనియర్ ఇంజనీర్ (జేఈ) ధర్మాన లోకేశ్‌తో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాలువల ఆధునికీకరణ, తక్షణ మరమ్మతులకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి నివేదించారు.
