జనవాసాల మధ్య రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్..
దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు: కలెక్టర్‌కు ఫిర్యాదు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న మురుగు నీరు, దుర్వాసన కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. ఈ మేరకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుక్కల వీర వెంకట సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే పరిస్థితి నెలకొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, గతంలో మొగల్తూరులో జరిగిన ఘటనలాంటి పరిస్థితులు పునరావృతం కాకముందే సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్లాంట్ నుంచి వెలువడుతున్న మురుగు నీరు, దుర్వాసన కారణంగా గ్రామస్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
