Lenin Collections | బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అఖిల్ చిత్రం..
Lenin Collections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కమర్షియల్ విజయాన్ని ఎట్టకేలకు ‘లెనిన్’ రూపంలో అందుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ పీరియాడిక్ రూరల్ రివెంజ్ డ్రామా విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, అఖిల్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లలో ఆయన ప్రదర్శనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథను తెరపై ఆవిష్కరించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వసూళ్ల లెక్కల ప్రకారం, ‘లెనిన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో అఖిల్ సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘లెనిన్’ కొత్త రికార్డు నెలకొల్పింది. మౌత్ పబ్లిసిటీతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కూడా పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరింత భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
