temple-arudra | శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో…
temple-arudra | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థాన శివాలయంలో సోమవారం శివుని జన్మ ఆరుద్ర నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి పంచామృత సహిత మహా రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, విశేష అర్చనలు, మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, శివుని జన్మ ఆరుద్ర నక్షత్ర పర్వదినాన భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
