Coal Block | సింగరేణిపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కిషన్‌రెడ్డి సవాల్

Coal Block | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ సింగరేణి భరోసా యాత్ర లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలో అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని, అనంతరం బొగ్గు బ్లాకుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వేలం ప్రక్రియ లేకుండానే సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను కేటాయించిందని తెలిపారు. ఈ బ్లాక్‌లో గ్రేడ్-8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు సింగరేణి అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉందని చెప్పారు. అలాగే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ను కూడా మోదీ ప్రభుత్వమే సింగరేణికి కేటాయించిందని పేర్కొంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి సమస్యలను తాను పలుమార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి వివరించానని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులకు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలు, సింగరేణిని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే సంస్థ పరిస్థితి దిగజారడానికి దారితీసిందని విమర్శించారు.

పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చేసిన మేలు ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుపై కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదని, సింగరేణికి ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ బకాయిలను చెల్లించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.24 వేల కోట్ల అప్పు మిగిల్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి అభివృద్ధి కోసం కేంద్రాన్ని సమర్థవంతంగా సంప్రదించలేదని, ఈ రెండు పార్టీలు సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు.