జాతీయ తైక్వాండో పతక విజేతలకు ఘన సన్మానం

నిజామాబాద్ స్పోర్ట్స్ (ఆంధ్రప్రభ): జాతీయ స్థాయిలో రజత పతకాలు సాధించి తెలంగాణ, నిజామాబాద్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఎన్. వర్షిణి, పారా తైక్వాండో క్రీడాకారుడు సాయిబాబాలను సోమవారం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. మహారాష్ట్రలోని పుణేలో ఈ నెల 8 నుంచి 11 వరకు జరిగిన 5వ ఇండియా తైక్వాండో పూమ్సే జాతీయ ఛాంపియన్‌షిప్–2026, 5వ ఇండియా ఓపెన్ పారా జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో వీరిద్దరూ రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్, గౌరవ అతిథిగా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పాల్గొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని పవన్ కుమార్ హామీ ఇవ్వగా, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని నర్సయ్య అన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేష్ పవార్, అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ ఈ విజయాలు క్రీడాకారుల కృషి, కోచ్‌ల శిక్షణ, తల్లిదండ్రుల సహకారం ఫలితమని కొనియాడారు. పారా విభాగంలో సాయిబాబా సాధించిన విజయం అంగవైకల్యం విజయానికి అడ్డుకాదని నిరూపించిందని ప్రశంసించారు.

క్యూరియస్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన కోచ్, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ మాట్లాడుతూ అక్టోబర్ 16 నుంచి 20 వరకు దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ తైక్వాండో పూమ్సే ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే తుది ట్రయల్స్‌కు తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక మహిళా క్రీడాకారిణి ఎన్. వర్షిణి అని తెలిపారు. కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొని జాతీయ పతక విజేతలను అభినందించారు.