వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు…
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు…
మంత్రి అచ్చెన్నాయుడు..
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ…
42 మంది సిబ్బందికి హెచ్చరిక..
టెక్కలి, ఆంధ్రప్రభ : జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను హెచ్చరించారు. సోమవారం ఉదయం 9 గంటలకే ఆకస్మికంగా టెక్కలి జిల్లా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, సుమారు గంటన్నర పాటు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆరా తీసిన ఆయన.. విధులకు ఆలస్యంగా వచ్చిన 42 మంది సిబ్బందికి మరోసారి పునరావృతం కాకుండా పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు.

ఆసుపత్రిలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కమిటీ వేసి 36 గంటల్లోగా నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌ను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, రోగులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఆసుపత్రిలో నీటి లభ్యత ఉన్న చోట వెంటనే కొత్త బోరు తవ్వించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించడంతో పాటు, రోగుల రాకపోకల సౌకర్యార్థం ప్రధాన గేటు వద్ద రెండు మాన్యువల్ గేట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రికి వచ్చే కేసులకు సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స అందించాలని, అత్యవసరమైతేనే జిల్లా కేంద్రానికి మారమ్మత్తులు చేయాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. ఓపీ విభాగాన్ని సందర్శించి రోగులతో మాట్లాడిన మంత్రి.. మరుగుదొడ్ల నిర్వహణ, ఫ్యాన్లు, లైట్లు, లిఫ్ట్ సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. మంత్రి చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద రూ. 18 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చారు.
ఇందులో 4 ఆపరేషన్ టేబుళ్లు, 5 మల్టీపారా మానిటర్లు, వీన్ ఫైండర్లు, రోగుల విశ్రాంతి కోసం 20 కుర్చీలను అందజేసి, వాటిని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే బాధ్యతారాహిత్య సిబ్బందిపై కఠినంగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మహారాజ్, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
