పొదుపు, స్వదేశీ వినియోగం, ఇంధన ఆదాపై మోదీ ఫోకస్
పొదుపు, స్వదేశీ వినియోగం, ఇంధన ఆదాపై మోదీ ఫోకస్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక సూచనలు చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు కొన్ని అలవాట్లను మార్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. బంగారం కొనుగోళ్ల నుంచి ఇంధన వినియోగం వరకు, విదేశీ పర్యటనల నుంచి స్వదేశీ వస్తువుల వినియోగం వరకు చేసిన ఈ సూచనలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- ఎడాపెడా బంగారం కొనొద్దు…
భారత్ ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. అవసరానికి మించి బంగారం కొనుగోలు చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అవసరమైనంత మాత్రమే బంగారం కొనుగోలు చేయాలని, దేశ సంపద దేశంలోనే ఉండేలా చూడాలని ప్రధాని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పొదుపులను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులుగా మలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
- పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి…
భారత్ ఇంధన అవసరాల కోసం విదేశీ చమురుపై ఎక్కువగా ఆధారపడుతోంది. పెట్రోల్, డీజిల్ వినియోగం అధికమైతే దిగుమతుల భారం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా, కార్ పూలింగ్, సైక్లింగ్ వంటి మార్గాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా కాపాడగలమని భావిస్తున్నారు.
- ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి…
భవిష్యత్తు పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వైపే సాగుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన దిగుమతుల అవసరం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో ఈవీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా ఈవీల వైపు మళ్లితే భారత్ పర్యావరణహిత దేశంగా ఎదిగే అవకాశముంది.
- వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ మీటింగ్స్‌కు ప్రాధాన్యం…
డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో అవసరంలేని ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ మీటింగ్స్ వల్ల సమయం, డబ్బు, ఇంధనం ఆదా అవుతాయి. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఈ సంస్కృతిని భారత్‌లో కూడా మరింత ప్రోత్సహించాలని భావిస్తున్నారు.
- విదేశీ పర్యటనలు తగ్గించాలి…
అత్యవసరమైతేనే విదేశీ పర్యటనలు చేయాలని సూచిస్తున్నారు. విదేశీ ప్రయాణాల వల్ల భారీగా విదేశీ కరెన్సీ ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. దేశంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా స్థానిక ఉపాధికి కూడా ఊతం లభిస్తుంది.
- వంట నూనెల వినియోగం తగ్గించాలి…
భారత్ భారీగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. అధిక నూనె వినియోగం ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతోంది. తక్కువ నూనెతో వంట చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
- రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి…
రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సారవంతత క్రమంగా తగ్గిపోతోంది. సహజ ఎరువులు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా భూమిని సంరక్షించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రైతులు సహజ సాగు వైపు మళ్లితే ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
- సోలార్ పంపులను వాడాలి…
వ్యవసాయ రంగంలో సోలార్ పంపుల వినియోగం పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. రైతులకు దీర్ఘకాలంలో ఖర్చులు తగ్గడంతో పాటు విద్యుత్ కోతల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వనరులను ఎక్కువగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.
- స్వదేశీ వస్తువులను ప్రాధాన్యం ఇవ్వాలి…
భారత్‌లో తయారైన వస్తువులను కొనుగోలు చేస్తే దేశీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు బలోపేతం అవుతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని కేంద్రం భావిస్తోంది. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
- మధ్య తరగతి ప్రజలు ఆడంబరాలు తగ్గించాలి…
అవసరంలేని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే ఆడంబరాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పొదుపు అలవాటు వల్ల భవిష్యత్తు అవసరాలను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబ ఆర్థిక భద్రతకు ఇది కీలకమని పేర్కొంటున్నారు.
