దేవలమ్మనాగరంలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలో కొనసాగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం దేవలమ్మనాగరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), ప్రాథమిక పాఠశాల (PS) ఆవరణలో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’ అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదల, కొత్త అడ్మిషన్లను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా AMO జానీ అఫ్గాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని, విద్యాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
మండల విద్యాధికారి గురువారావు మాట్లాడుతూ.. మండలంలోని పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నర్సింహ రెడ్డి, గ్రామ సర్పంచ్ గౌరీ శ్రీనివాస్, ఉన్నత పాఠశాల AAPC చైర్మన్ ప్రియాంక, ప్రాథమిక పాఠశాల AAPC చైర్మన్ సుగుణమ్మ, పంచాయతీ కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
