Meenakshi Natarajan | పిటిషన్ కొట్టివేత
Meenakshi Natarajan | పిటిషన్ కొట్టివేత
మీనాక్షి నటరాజన్ కు నిరాశ
Meenakshi Natarajan |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. మీనాక్షి నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మీనాక్షి నటరాజన్ పై రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ కేసులు లేవని, కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ఆయన కోర్టుకు వివరించారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం, నామినేషన్ తిరస్కరణ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇలాంటి అంశాల్లో గతంలో ఇచ్చిన తీర్పులు ఏమైనా ఉంటే కోర్టు ముందు ఉంచాలని సూచించిన ధర్మాసనం, రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించిన తర్వాత ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సరైన విధానమని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణకు అర్హత లేదని తేల్చి కొట్టివేసింది.
