Pawan Kalyan | స్వీట్ మెమోరీస్ పంచుకున్న అన్నా!

Pawan Kalyan | స్వీట్ మెమోరీస్ పంచుకున్న అన్నా!

Pawan Kalyan | ఆ రోజు మ‌రువ‌లేనిది..
పవన్ ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు..
పవన్ ప్రమాణ స్వీకార జ్ఞాపకాలు పంచుకున్న అన్నా
డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు
‘ఆ అవమానాలు, ఆ పోరాటం నాకు తెలుసు’ అంటూ భావోద్వేగ పోస్ట్

Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, విమర్శలు, అవమానాలను గుర్తుచేసుకుంటూ ఆమె తన మనసులోని భావాలను పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గుర్తును చేతబట్టి పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలతో పాటు, ఆయన పిల్లలు ఆద్య, అకీరా నందన్, అలాగే మెగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భానికి సంబంధించిన చిత్రాలను అన్నా షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. “ప్రజలు విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఆ విజయం వెనుక ఉన్న సంవత్సరాల శ్రమ, బాధ, అవమానాలు, అనిశ్చితి చాలా కొద్దిమందికే తెలుసు” అంటూ పవన్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

“ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు, విమర్శలు, ఎగతాళి, అవమానాలను నేను దగ్గరగా చూశాను. ఆయన ప్రజల కోసం పోరాడుతుంటే, నేను ఇంట్లో పిల్లల కోసం ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాను. కొన్ని రోజుల్లో నేను కూడా కుంగిపోయాను. అయినా మేము వెనక్కి తగ్గలేదు” అని ఆమె పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ రోజు తన కళ్లలో ఆనందభాష్పాలు నిండిపోయాయని అన్నా వెల్లడించారు. “ఆ క్షణం రాజకీయ విజయం మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాల పోరాటానికి దక్కిన గౌరవం. ఆ సమయంలో నేను భావోద్వేగానికి లోనవడం ప్రధాని మోదీ కూడా గమనించారు. అవి స్వచ్ఛమైన ఆనంద కన్నీళ్లు” అని ఆమె రాశారు.

చివరగా, “వదులుకోవడానికి నిరాకరించిన ఆ వ్యక్తి పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను” అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని ముగించారు.

అన్నా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.