ప్రజలకు చేరువగా పీజీఆర్ఎస్

ప్రజలకు చేరువగా పీజీఆర్ఎస్

కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రజలకు చేరువగా ప్రభుత్వం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజల సమస్యలను స్థానికంగానే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో శుక్రవారం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షత వహించగా, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు హౌసింగ్ పీడీ జి.పిచ్చయ్య, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి తదితర అధికారులు పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఒక్కో నియోజకవర్గంలో నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికే మే 15, మే 22 తేదీలలో రెండు విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మే 29న మూడవ విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత రెండు విడతలుగా నిర్వహించిన పీజిఆర్ఎస్ సమావేశాల్లో వరుసగా 212, 229 అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ రోజు స్వీకరించిన 354 దరఖాస్తులతో కలిపి మొత్తం 795 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 133 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులు వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా, ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి, నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే దరఖాస్తులు చేసుకునే పరిస్థితి రాకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకునే కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం కూడా ఒకటి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీలు సమర్పించడం ప్రజలకు కొంత ప్రయాసతో కూడుకున్న విషయమని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలోనే పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి రావడం, స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా, సులభంగా జరుగుతుందని శాసనసభ్యులు తెలిపారు. సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. నూటికి 70 – 80 శాతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరుకు, 30శాతం దరఖాస్తులు భూతగాధాలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు పరిధిలో ఉన్నవి వస్తున్నాయని అన్నారు. కోర్టు లిటిగేషన్లో ఉన్న ఫిర్యాదులపై కలుగజేసుకోవద్దు అని హితవు పలికారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు జిల్లా కలెక్టర్ స్వయంగా వివిధ కౌంటర్ల వద్ద జరుగుతున్న అర్జీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సావధానంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు కౌంటర్ల వద్దకు వచ్చినప్పుడు వారికి కూర్చునే సౌకర్యం కల్పించి, ప్రాధాన్యతతో సేవలు అందించాలని ఆదేశించారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేయడం విశేషంగా నిలిచింది. ప్రజల స్పందన కార్యక్రమం పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply