Medicine Centers | ప్రైవేట్ కు.. చెక్

Medicine Centers | ప్రైవేట్ కు.. చెక్

Medicine Centers | మూగజీవాలకూ జ‌న‌రిక్ మెడిసిన్స్
తక్కువ ధరకే అందుబాటులో మందులు
జిల్లాలో రెండు జనరిక్ పశు ఔషధ‌ కేంద్రాలు ఏర్పాటుకు సన్నద్ధత
50 శాతం తగ్గింపుతో మందులు అందించేందుకు ప్రభుత్వం కృషి

Medicine Centers | కృష్ణా బ్యూరో ఆంధ్రప్రభ : ప్రైవేట్ మందుల షాపులకు చెక్ పెట్టి మూగజీవాలకు మందులను తక్కువ ధరలకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రైవేట్ మందులు షాపుల వద్ద పాడి రైతులు అడిగినంత చెల్లించి నష్టపోతున్న విషయమై ప్రభుత్వం గుర్తించి జనరిక్ పశు ఔషధ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కృష్ణా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక జనరిక్ పశు ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి సిద్ధమైంది.

ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో రెండు జనరిక్ పశు ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. జిల్లాలో పశువుల వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించే లక్ష్యంతో జనరిక్ పశు ఔషధ కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించటమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేయనున్నాయి.

వన్ స్టాఫ్ సెంటర్లుగా పశు ఔషధ కేంద్రాలు
ఈ కేంద్రాలు కేవలం మందుల దుకాణాలుగా మాత్రమే కాకుండా వన్ స్టాఫ్ సెంటర్లుగా పని చేస్తాయని జిల్లా పశుసంవర్థ‌క శాఖ అధికారి సీహెచ్.నరసింహులు తెలిపారు. ఇక్కడ పశువుల వ్యాధులకు అవసరమైన జనరిక్ మందులు రైతులకు లభిస్తాయని తెలిపారు. తొలి విడతగా జిల్లాలో అత్యంత కీలకంగా రెండు ప్రాంతాల్లో ఈ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు. అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో పశు ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

వీరి నిర్వహణలోనే కేంద్రాలు
ప్రైవేట్ మందుల దుకాణాలతో పోలిస్తే ఈ కేంద్రాల్లో జనరిక్ మందులు అత్యంత తక్కువ ధరకే లభిస్తాయి. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా అర్హత పొందిన ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు లేదా రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పీఓలు) ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పశువైద్యశాల ప్రాంగణాల్లోనే ఈ కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని, రైతులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.

ప్రభుత్వం నుంచి తుది అనుమతులు రాగానే అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో ఈ రెండు జనరిక్ పశు ఔషధ కేంద్రాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పశుసంవర్థ‌క శాఖ జేడీ తెలిపారు. తక్కువ ధరలో మందులు అందించటం ద్వారా జిల్లాలో పాడి రైతుల ఆదాయం పెరగటమే కాకుండా, పశువుల ఆరోగ్య సంరక్షణ మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా జనరిక్ మందుల కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

అందుబాటులో అని్న ర‌కాల మందులు
ప్రైవేట్ మందుల షాపుల దగా నుంచి పాడి రైతులకు నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పశు జనరిక్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయటం ద్వారా పాడి రైతులు సులువుగా తమ మూగజీవాలకు అవసరమైన మందులు తక్కువ ధరలకు పొందే అవకాశం ఉంది. ఈ జనరిక్ కేంద్రాల్లో మూగజీవాలైన మేకలు, కోళ్లు, గేదెలు, ఆవులు, గొర్రెలు, కుక్కలు తదితర జీవాలకు జ్వరానికి, ఇన్ఫెక్షన్, యాంటిబయాటిక్స్, నొప్పులు, టానిక్లు అందుబాటులో ఉంటాయని పశువైద్య అధికారులు తెలుపుతున్నారు. పారాసిట్మాల్, పెన్సిలిన్ ఇంజెక్షన్లు, యాంపిసిలిన్, సిప్రోప్లాక్సిన్, ఎండ్రో ప్లాక్సిన్ వంటి మందులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని తెలుపుతున్నారు. పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ‌ తీసుకోవటం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

click here to read మోదీ.. విదేశీ బాట‌

click here to read more