నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

  • రెండు లారీలు ఢీ..
  • వ్యక్తితో పాటు 150 గొర్రెలు మృతి..
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటిపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి చిట్టెగొండ ఎల్లయ్య (35) తో పాటు, 150 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా కోడేరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చిట్టెగొండ ఎల్లయ్య తన భార్య పద్మమ్మ, కుమారుడు మల్లికార్జున్ లతో కలిసి గొర్రెల మేత కోసం ఆరు నెలల క్రితం గుంటూరు జిల్లాకు వలస పోయాడు.

వేసవికాలం ముగియడంతో మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా మండే పూరి గ్రామం నుండి డీసీఎం వాహనంలో గొర్రెలను ఎక్కించుకొని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ సమీపంలో మరమ్మత్తు కు గురై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గొర్రెల లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందగా, 150 గొర్రెలు కూడా మృతి చెందాయి. గొర్రెలను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ రాము తీవ్ర గాయాల పాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతుని భార్య పద్మమ్మకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రూ. లక్ష రూపాయల తక్షణ సహాయం అందజేత

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, రాష్ట్ర కురుమ గొల్లల కార్పొరేషన్ అధ్యక్షురాలు సరిత యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లు మృతుని భార్య పద్మమ్మకు లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్పొరేషన్ నుండి మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని కార్పొరేషన్ చైర్మన్ సరిత యాదవ్ చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Leave a Reply