ఐఐటి చుక్కా రామయ్య సేవలు ఆదర్శంగా తీసుకోవాలి..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అనాథలు, నిరుపేద విద్యార్థులకు వరంగా మారిందని మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఐఐటి చుక్కా రామయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ సేవలు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు.
వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న యూనిక్ హై స్కూల్లో టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న, తల్లిదండ్రులు లేని మరియు నిరుపేద ప్రతిభ గల విద్యార్థులకు ఈ ట్రస్ట్ మంచి అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు.
ప్రస్తుత సమాజంలో స్వార్థం పెరుగుతున్న తరుణంలో, సమాజం కోసం తపిస్తూ సేవలు అందిస్తున్న ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ ప్రతినిధులను ఆయన అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విలువలతో కూడిన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్. వెంకట్ రత్నం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జిల్లా నుంచి నిరుపేద, అనాథ విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా నుంచి 50 మంది విద్యార్థులు ఈ ట్రస్ట్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని, ఎంపికైన విద్యార్థుల విద్య పూర్తయ్యే వరకు మొత్తం ఖర్చులను ట్రస్ట్ భరిస్తుందని చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 36 మంది విద్యార్థులు హాజరయ్యారు.
కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్. బాబురావు, కోటిపల్లి మండల అధ్యక్షుడు పి. రామచంద్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు జి. రాములు, యూనిక్ హై స్కూల్ కరస్పాండెంట్ తిరుమల, పీపీటీ ప్రతినిధులు బుచ్చిబాబు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
