may16finance | ఆర్థిక ఉపద్రవాన్ని అధిగమించే మనోధైర్యంతో వుందాం!

may16finance | ఆర్థిక ఉపద్రవాన్ని అధిగమించే మనోధైర్యంతో వుందాం!

may16finance | ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన ఆర్థిక వాస్తవాలు
విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వ సూచనలు
ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై పెరుగుతున్న ఆందోళనలు
టూరిజం, ఎగుమతులతో విదేశీ మారకద్రవ్య సాధన
ప్రజల సహకారం, ప్రభుత్వ బాధ్యతల సమతుల్యత
యుద్ధ ప్రభావాల మధ్య దేశ ఆర్థిక స్థైర్యం

may16finance | అయిదు రాష్ట్రాల ఎన్నికల హడావిడితో పశ్చిమ ఆసియా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌తోపాటు రష్యా, ఉక్రెయిన్‌లోని యుద్ధ జ్వాలలకు సెగ పెట్తూ, చల్లారుస్తూ ‘డిప్లమసీ‘ అన్న పదానికి విపరీతార్థాలు ప్రసాదించిన అమెరికన్‌ ప్రసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలీ అన్నీ భారతీయులు కొంతకాలం మర్చిపోయారు. కానీ ముందున్నది ముసళ్ళ పండుగ అని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముందునుంచే హెచ్చరించక పోవటం, తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు!

భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ జ్వాలలతో మన దేశ ప్రమేయం లేకపోయినా, ఎలక్షన్ల ముందు రాబోయే ఆర్థిక ఉపద్రవాల గురించి భారత దేశంలోని ప్రజలను హెచ్చరించినట్లయితే ఇంత పరిణామంలో ఏమరుపాటుతో ఉండక పోయేవారేమో! అంతేగాదు ఎన్నికల్లో ప్రతి పార్టీకీ గెలవాలనే వుంటుంది! అటువంటి తరుణంలో సాధ్యమైనంత వరకూ ముంచుకొస్తున్న ప్రమాదాలను గురించి సహజంగానే అధికారంలో వున్న పార్టీ మాట్లాడదు! ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌‘ అన్న ధోరణిలో మన దేశం మీద ఆర్థిక ప్రభావం తక్కువగా వుంటుందని ఆయిల్‌ సరఫరాకు రెండు నెలల పాటు ఢోకాలేదని, అందువల్ల చమురు, పెట్రోలు, గ్యాస్‌ విషయాలలో ధరల పెంపుదల వుండదని కేంద్రంలోని సంబంధిత మంత్రులు పదేపదే ఊదరకొట్టటంతో ‘నిజమే కాబోలు’ అని అమాయక జనం నమ్మినట్లుంది! అందుకే విపక్షాల ఆందోళనల గురించి పట్టించుకోలేదు! ఎన్నికల సంరంభంలో తమ మీద యుద్ధ ప్రభావంతో పడే ఆర్థిక భారాన్ని పెద్దగా లెక్కచేయలేదు!

కానీ ఎన్నికలు ఫలితాలు అన్నీ సర్దుబాటయ్యి, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్‌.డి.ఏ కు అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత, మంత్రులు విదేశ పర్యటనలు ముగించుకున్న తర్వాత ప్రభుత్వం హెచ్చరించింది ముందున్నది గడ్డు కాలం అని! బంగారం దిగుమతి చేసుకోవద్దని బంగారం కొనుగోలు కొన్నాళ్ళు ఆపుతే ప్రభుత్వం మంచిదని ప్రజలకు ప్రభుత్వం సంకేతాలు పంపింది! గ్యాస్‌, ఆయిల్‌ ధరలు ఎన్నికలు, ఫలితాల సందడి అయిపోగానే ఆకాశం వైపు పరుగులు తీసాయి! ప్రతి వస్తువూ కూరగాయలతో సహా ప్రియమయ్యాయి! విదేశీ పర్యటనలు అంతకు మునుపే తగ్గుముఖం పట్టాయికానీ, ప్రధాని ప్రకటనతో మరింత తక్కువయ్యాయి! ఈ పరిస్థితులలో కడుపులు కాస్తంత కట్టుకొని వ్యవహరించండి అన్న సూచన చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుక్కున్నట్లుగా మారింది!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ డాటా ప్రకారం, నిజమైన విదేశీ ఖర్చులు, స్థిరాస్తులు కొనుగోలు (విదేశాలలో), పెట్టుబడి, విదేశాలకు పంపే బహుమతుల మీద ఖర్చులు, అవన్నీ కలుపుతే 12.7శాతంకు 19.1శాతం నుంచి, 2025-26, 2024-25 (అంటే పదకొండ నెలల్లో) తగ్గాయి! నిజానికి విదేశ ప్రయాణాల మీద కంటే విదేశాలో పెట్టుబడుల మీదనే భారతీయులు ఖర్చు పెట్తున్నారు! విదేశీయానం మీద ఖర్చులు తగ్గుతున్నాయి! ప్రధాని, విదేశాల ప్రయాణాలపై ప్రజలు ఖర్చులు తగ్గించాలని కోరటం హర్షించదగ్గ సూచన! అదేవిధంగా విదేశాల్లో మనవాళ్ళు పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేస్తూ ఖర్చు పెట్టటం గూడా తగ్గించాలని ప్రధాని కోరారు. ఈ ఖర్చులు గూడా గణనీయంగా తగ్గుతున్న పరిస్థితి కనపడుతున్నది.

ప్రభుత్వం ప్రజల విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరటం మంచిదే కానీ ప్రభుత్వం విదేశీ పర్యాటకులు మన దేశానికి రావటం గురించి దృష్టిపెట్టి, ఆ పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం వారు చర్యలు తలపెట్తే లాభదాయకంగా వుంటుంది! పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్త పరిస్థితుల వల్ల విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట నిజం! ఇంటర్‌ నేషనల్‌ టూరిస్టులను ఆకర్షించే చర్యల వల్ల ఎక్కువ ‘ఫారిన్‌ ఎక్ఛేంజి‘ సంపాదించుకోగలం!

బంగారం కొనుగోలు తగ్గించాలను కోవటం కంటే ఎగుమతులను స్థిరమైన గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జి.యమ్‌.ఎస్‌) రెగ్యులేషన్‌ ద్వారా, ప్రత్యక్ష విధానాలు అవలంబిస్తే బాగుంటుందని అఖిల భారత రత్న మరియు ఆభరణాల దేశీయ మండలి (జి.జె.సి) వారు ప్రభుత్వాన్ని కోరటం గమనించదగ్గ విషయంగా పరిగణనలోకి తీసుకోవాలి! అవినాష్ గుప్తా ఇండ్లలో, లాకర్లలో బంగారాన్ని దాచుకోవటం కంటే, జి.యం.యస్‌ ఆర్థికంగా లాభదాయకంగా వుండే విధంగా, నిబంధనలను రూపొందించి వాటికి అనుగుణంగా ఛానలైజ్‌ చేస్తే అందరికీ లాభం అన్నట్లు సూచించారు! ఆ సూచనను గూడా పరిగణనలోకి తీసుకోవచ్చు!

విమానయానం గురించి మరొక ముఖ్యమైన ఆలోచనను గూడా మనం గమనంలోకి తీసుకోవాలి! ప్రభుత్వం విదేశీయానం తగ్గించాలన్న సూచనను ఆచరిస్తునే ప్రభుత్వం దీనికి సంబంధించినదే మరో సూచనను గూడా (మీడియాలో వచ్చింది) పరిగణనలోకి తీసుకోవచ్చు! ఆదాయాన్ని పొదుపు చేసే విషయంలో ప్రభుత్వంతో ఏకీభవిస్తూ దేశంలో విమాన ప్రయాణాలను ఆకర్షించటంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తే బాగుంటుందని టూరిజం పరిశ్రమ కోరింది. సహజంగానే పొదుపు విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలూ కట్టుబాట్లు పెట్తే ప్రజలూ వాణిజ్య ప్రముఖులూ, నాయకులూ అందరూ సూచనలు యివ్వటం సహజంగా జరిగే విషయమే! వారు యిచ్చే సూచనలు ఎంతవరకు ఆచరణ యోగ్యమో ప్రభుత్వం వాటిని పరిశీలించి తగు విధంగా చర్యలు తీసుకోగలుగుతే ప్రజలూ యితర ప్రముఖుల సహకారంను పొందే అవకాశం సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది!

ఈ పరిస్థితులలో ద్రవ్యోల్బణం (ఇన్‌ప్లేnషన్‌) దేశ ఆర్థిక విధానాలలో ఏవిధంగా ప్రభావితం చేయబోతున్నదన్న ముఖ్యమైన అంశంను ప్రభుత్వం ఆర్థిక నిపుణులు పరిగణనలోకి తీసుకోవాలి! కొన్ని గణాంకాలు నమ్మక తప్పదు! ఎందుకంటే వాటిని ఖండించటానికి సామాన్యులకు ఆర్థిక విజ్ఞానం తగినంతగా వుండదు కాబట్టి!

భారత దేశంలో ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.48శాతంగా కొంచెం తృప్తికలిగించే విధంగానేవుంది! (ఈమార్చితోసరిపోల్చుకుంటే3.4 దగ్గర ద్రవ్యోల్బణం వున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి). 13 నెలల కాలంలోలెక్కలు కొంచెం సంతృప్తిపడే విధంగావున్నాయనేఅనుకోవచ్చు! అయితే హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 3.88శాతం నుంచి ఏప్రిల్‌ నెలలో 8.3శాతంకు వచ్చింది.

42 నెలల్లో అంత ఎక్కువయినట్లుగా వున్నట్లు లెక్క. పోను పోను గణాంకాలు ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో జరుగుతున్న గ్లోబల్‌ పరిణామాల వల్ల నమ్మలేని స్థితికి వచ్చినా, కంగారు పడినా, ప్రయోజనం వుండదు! ఆర్థిక పరిస్థితులు ఆర్థికాభివృద్ధి కొంతవరకే మనం గీసిన గీతల్లో వుంటాయి! తరువాత పరిస్థితులు గీసే గీతల్లోకి గెంతుతాయి! అందుకని సామాన్య జనం అర్థం కాని విషయాలను గురించి ఆలోచించే బదులు ఏవిధంగా ఆర్థిక స్థితి గతులను అందుబాటులో వ్యక్తులుగా వుంచుకోటానికి తమవంతు సహాయం, సహకారం, ప్రభుత్వాలకు అందివ్వటమే మంచిది! రూపాయి విలువ దారుణంగా పడిపోవటం అందరికీ తెలిసిందే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ సాధ్యాసాధ్యాల పరిమితుల్లోనే ద్రవ్యోల్బణాన్ని 2శాతం నుంచి 6శాతం వుంచగలుగుతే అదే పదివేలు! ప్రభుత్వానికి గాని, రిజర్వ్‌ బ్యాంక్‌కు గాని ద్రవ్యోల్బణ తరుగుదల, పెరుగుదలను అదుపులో వుంచే ఫూల్‌ ఫ్రూఫ్‌ మెథడ్స్‌ కానీ లేవు! యుద్ధం పరిణామాలు ప్రపంచ మంతటా ప్రభావితం చేసేలా వుంటే మన దేశం కూడా ఆ ప్రభావ ఫలితాలను అనుభవిస్తూనే ఎంతవరకు ‘సేఫ్‌ జొన్‌‘లో వుండగలుగుతామో ప్రయత్నించటమే తప్ప అలివికాని ధోరణిలో వుండటం కుదరదు!

ఎవరేమన్నా యింతవరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వమ రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం నలువైపులా క్రమ్ముకొని వస్తున్న తరుణంలో సాధారణ స్థితిలోనే యింకా వున్నామనే మనోధైర్యంను కల్పించటంలో సఫలమయ్యారు! ఈ స్థితిలో మరికొన్నాళ్ళ పాటు వుండగలుగుతే పరిస్థితులు మెరుగవుతున్నట్టేనని భావించక తప్పదు! ఆ ఆశావాదంతోనే నిత్య జీవితాన్ని నిశ్చయ రూపంలో కొనసాగిస్తూ పౌరులుగా సక్రమ రీతిలో బాధ్యతలు నిర్వహస్తే చాలు!

CLICK HERE TO READ No Clarity Trump : ఇరాన్ ఊసే లేదు…

CLICK HERE TO READ MORE

Leave a Reply