MassiveFire | బాణాసంచా షాపులో భారీ మంటలు

MassiveFire | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని రద్దీ ప్రాంతమైన కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో ఉన్న శివ ఫైర్‌వర్క్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం కారణంగా మార్కెట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనపై స్పందించిన విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్, శివ ఫైర్‌వర్క్స్‌కు పోలీసుల నుంచి అనుమతి లేదని తెలిపారు. అయితే దుకాణ యజమాని కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. జనావాసాలు, రద్దీ వ్యాపార ప్రాంతాల్లో పేలుడు పదార్థాల విక్రయం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన ఏసీపీ, దుకాణ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.