Mallareddy | నేనే సినిమా తీస్తా…

Mallareddy | నేనే సినిమా తీస్తా…
విలన్ పాత్రను తిరస్కరించిన మాజీ మంత్రి
Mallareddy |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు సినిమాలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. తన జీవితకథను సినిమాగా తీయాలని ఉందని, ఆ సినిమాను తానే నిర్మిస్తానని తెలిపారు.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారని మల్లారెడ్డి వెల్లడించారు. అయితే ఆ పాత్రకు తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. విలన్ పాత్ర అంటే హీరో చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుందని, వేలాది మంది తన విద్యార్థులు, అభిమానుల ముందు అలా కనిపించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నానన్నారు. త్వరలోనే సినిమాల్లోకి వస్తానని, తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కే చిత్రంలో తాను కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తానని తెలిపారు. తన పాత్రకు ఏ హీరో సరిపోతాడో దర్శకుడే నిర్ణయిస్తారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
