22ndaprilchintana | చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం

22ndaprilchintana | చాణక్య నీతిలో శిరస్సు ప్రాధాన్యం

22ndaprilchintana | గౌరవం, విధేయతలో తలవంచడం భావం
పూర్వీకుల అలంకరణలు, సంప్రదాయాలు
సామెతల్లో దాగిన జీవన సత్యాలు
శిరోజాల సంస్కృతి మరియు ఆధునిక ప్రభావం
తల రక్షణలో హెల్మెట్ అవసరం
ప్రాణ రక్షణకు జాగ్రత్తల ప్రాముఖ్యత

22ndaprilchintana | సకల శరీర భాగాలలో తల అత్యంత ప్రధానమైనదని చాణక్య నీతి చెబుతోంది. సకల అవయవాలకు ఆజ్ఞలను జారీ చేసే మెదడు, జ్ఞానేంద్రియాలు శిరోభాగంలోనే ఉండటం, అలాగే అది శరీరంలోని పైభాగంలో ఉండటం వల్ల శిరస్సు శరీరానికి అత్యంత ప్రధానమైనదిగా భావించబడింది. అందుకే శిరస్సును ఉత్తమాంగం, ప్రధానాంగం అని కూడా వ్యవహరిస్తారు. ప్రతి విభాగంలోనూ కీలకమైన అధికారిని “హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్” అని అంటారు. ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని “తలవాకిలి” అని పేర్కొనడం కూడా యాదృచ్ఛికం కాదు.

దైవానికి, గురువులకు, పూజ్యులకు, పెద్దలకు తలవంచి నమస్కారం చేయడం వారి పట్ల మన గౌరవాన్ని, విధేయతను సూచిస్తుంది. అయితే శత్రువులకు తలవంచడం అంటే వారి ఆధిక్యతను, తన పరాజయాన్ని అంగీకరించడమే. అది అవమానకరం. దీనినే “తలవంపులు” అంటారు. శత్రువులనుండి, ఆపదలనుండి, వాతావరణ ప్రభావాలనుండి రక్షణ పొందేందుకు సురక్షిత ప్రదేశంలో ఆశ్రయం పొందడాన్ని “తలదాచుకోవడం” అంటాము. ప్రాణరక్షణ చేసుకోవడాన్ని “తల కాచుకోవడం” (కాపాడుకోవడం) అంటారు.

అలంకార ప్రియులైన మన పూర్వీకులు తలకు కూడా ఎన్నో అలంకారాలు, ఆభరణాలు ధరించేవారు. సుతిమెత్తని మెదడుకు రక్షణగా ఉన్న కపాల భాగాన్ని, దానిపై ఉన్న శిరోజాలను సుగంధ తైలాలతో మర్దన చేసి, చిక్కులు పడకుండా విడదీసి అందంగా దువ్వుకునేవారు. పురుషులు శిఖను, స్త్రీలు సిగను రకరకాలుగా తీర్చిదిద్దుకునేవారు. వివిధ రకాల పువ్వులు, మణి మాణిక్యాలతో తలను అలంకరించుకునేవారు.

“జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే” అనే తెలుగులోని ప్రసిద్ధ సామెత. పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు ఉన్నవారికి ఎలాంటి కేశాలంకరణ అయినా ఆకర్షణీయంగానే ఉంటుంది. అలాగే సమర్థత, తగినంత వనరులు ఉన్నవారు ఏ ప్రయత్నం చేసినా అది తప్పక విజయవంతం అవుతుందనే భావనను ఈ సామెత సూచిస్తుంది.

శిరోమణులు లేదా తలమాణిక్యాలు ఆనాటి ఆభరణాలలో విశిష్టమైనవిగా పరిగణించబడ్డాయి. అందుకే అన్నింటిలో లేదా సమూహంలో శ్రేష్ఠులను “తలమాణికాలు” అని ప్రశంసించేవారు. తలపై పురుషులు తలపాగాలు, స్త్రీలు మేలిముసుగులు ధరించి తలకు అందంతో, గౌరవాన్ని, వాతావరణం నుండి రక్షణను పొందేవారు. తమకంటే ఉన్నతులు, గౌరవనీయులు ఎదురైతే తలపాగాను తీసి చేతిలో పెట్టుకోవడం ఆనాటి సంప్రదాయం. పెళ్లి పెద్దలు, పెళ్లి కొడుకు వంటి ముఖ్యులకు తలపాగాలు సమర్పించడం, వాటిని స్వయంగా వారి తలలపై ధరింపజేయడం కూడా ఆనాటి వివాహ సంప్రదాయాలలో ముఖ్యమైనది.

ఒత్తైన, చిక్కటి, పొడవైన శిరోజాలు, వాటిని రకరకాలుగా అలంకరించుకునే తీరుతెన్నులు అనాదిగా మన సంస్కృతిలో భాగాలే. ఆనాటి శిల్పులు వాటిని తమ శిల్పాలలో అద్భుతంగా మలిచిన తీరు శ్లాఘనీయం. మన సంస్కృతికి చెందిన శిరోజాలంకరణను ధమ్మిల్లము, కేశపాశము అని పూర్వ కవులు తమ కావ్యాలలో అద్భుతంగా వర్ణించారు. అయితే కాలానుగుణంగా నేడు మన యువతీ యువకులు పాశ్చాత్య శిరోజ శైలిని అనుసరిస్తున్నారు. అలాంటి మార్పును ఆధునిక యుగంలో అనివార్యంగా స్వాగతించాల్సిందే.

తలకు దెబ్బ తగిలితే మతి స్థిమితం కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. అందుకే వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. నేటి కాలంలో హెల్మెట్లే మన తలమాణికాలు. “బ్రతికి యుండిన శుభములు పొందవచ్చు”. కనుక శిరస్త్రాణ ధారణలో నిర్లక్ష్యం వీడి, అందరూ తమ తలలను, ప్రాణాలను కాపాడుకోవాలని ఆశిద్దాం.

  • డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply