వీడిన మల్లప్పకొండ మర్డర్ మిస్టరీ..
- భార్య–ప్రియుడి కుట్రతో భర్త హత్య.. ఆరుగురు అరెస్ట్, ఇద్దరు పరారీలో
కుప్పం రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల కుప్పం నియోజకవర్గ పరిధిలో సంచలనం సృష్టించిన మల్లప్పకొండ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భర్త రమేష్‌ను హత్య చేసింది అతని భార్య హాసినే అని, ఆమె తన ప్రియుడు గంగాధర్‌తో కలిసి పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు.
శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిపురం మండలానికి చెందిన హాసినికి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సూలగిరి ప్రాంతానికి చెందిన రమేష్‌తో 2024లో పెద్దలు వివాహం జరిపించారని తెలిపారు. అయితే పెళ్లికి ముందే హాసిని తమ గ్రామానికి చెందిన గంగాధర్‌ను ప్రేమించిందని, వివాహానంతరం కూడా అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందన్నారు.
ఈ విషయం తెలుసుకున్న రమేష్ భార్యను పలుమార్లు మందలించడంతో హాసిని, ఆమె ప్రియుడు గంగాధర్ కక్ష పెంచుకుని రమేష్‌ను హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు తెలిపారు.
ఆ ప్రణాళికలో భాగంగా ఈ నెల 13న హాసిని తన భర్తను పుట్టింటికి పిలిపించి, గుడుపల్లి మండలంలోని మల్లప్పకొండకు మొక్కు ఉందని నమ్మించి తన చిన్నారి కుమార్తెతో కలిసి అక్కడికి తీసుకెళ్లిందన్నారు. స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మూడో మలుపు వద్ద ముందుగా సిద్ధంగా ఉన్న నిందితులు రమేష్‌ను తాళ్లతో కట్టి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు డీఎస్పీ వివరించారు.
ఈ కేసులో హాసిని, గంగాధర్‌తో పాటు గంగాధర్ స్నేహితులు పవన్, శేఖర్, సంతోష్, సురేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు శ్యాంసన్, శివలు పరారీలో ఉన్నారని చెప్పారు.
హత్య జరిగిన విషయం తెలిసిన వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు గుడుపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పం, కుప్పం పోలీస్ స్టేషన్ల ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి కేసును త్వరితగతిన ఛేదించినట్లు తెలిపారు.
నిందితులను శాంతిపురం మండలం శివరామపురం సమీపంలో అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు.
