యాదమరిలో భారీ గంజాయి పట్టివేత

యాదమరిలో భారీ గంజాయి పట్టివేత

రూ.16.88 లక్షల విలువైన గంజాయి, వాహనం స్వాధీనం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై చిత్తూరు జిల్లా పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా యాదమరి మండల పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో రూ.16.88 లక్షల విలువైన గంజాయి, వాహనం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల వద్ద నిఘాను బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

చిత్తూరు సబ్ డివిజన్ పోలీసు అధికారి జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ వెస్ట్ సీఐ వి. శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో యాదమరి ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీసు సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ ఆర్. జయంతి సంయుక్తంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారిపై యాదమరి మండలం వరిగిపల్లి జంక్షన్ సమీపంలోని బాన్స్ హోటల్ సర్వీస్ రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న రెనాల్ట్ డస్టర్ కారును సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు ఆపి తనిఖీ చేశారు.

తనిఖీల్లో వాహనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో దాచిపెట్టిన 39.6 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా సేకరించి, ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు తరలిస్తున్నట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో కిలో గంజాయిని సుమారు రూ.30 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా ముఠాలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

అరెస్ట్ అయిన నిందితులను ఒడిశా రాష్ట్రానికి చెందిన దీక్షిత్ సుక్రిత్‌ (22), మురళీధర్ బురడీ (33)గా పోలీసులు గుర్తించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి 39.6 కిలోల గంజాయి, రూ.5 లక్షల విలువైన రెనాల్ట్ డస్టర్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.11.88 లక్షలు కాగా, మొత్తం ఆస్తుల విలువ రూ.16.88 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, యువత, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.