ఎర్ర సత్యం సేవలు చిరస్మరణీయం
మహబూబ్నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే దివంగత మారతి సత్యనారాయణ ముదిరాజ్ (ఎర్ర సత్యం) 31వ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఘన నివాళులర్పించారు. ఎర్ర సత్యం విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ “ప్రజలే దేవుళ్లు.. ప్రజాసేవే పరమావధి” అనే సిద్ధాంతంతో ఎర్ర సత్యం తన రాజకీయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. మహబూబ్నగర్ శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారని, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవలందించారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి సంపాదించిన ప్రజాభిమానమే ఆయనకు చిరస్థాయి గుర్తింపునిచ్చిందన్నారు. ఎర్ర సత్యం అకాల మరణం జిల్లా రాజకీయాలకు, ప్రజాజీవితానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటికీ కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
