AP | అంబటి రాంబాబు సహా 17 మందిపై కేసు..

AP |గుంటూరు, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమా తదితరులపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ నెల 10న గుంటూరులోని శంకరవిలాస్‌ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ 30 పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించి, ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ప్రదర్శన నిర్వహించారని పోలీసులు ఆరోపించారు.

ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసులు సూచించినా.. వాటిని పట్టించుకోకుండా ప్రదర్శన కొనసాగించారని అరండల్‌పేట ఎస్‌ఐ ఈశ్వరరావు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమాతో పాటు రాజనారాయణ సహా మొత్తం 17మంది వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.