పౌరులకే ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్తులకు చట్టం ప్రకారమే చర్యలు
పౌరులకే ఫ్రెండ్లీ పోలీసింగ్.. నేరస్తులకు చట్టం ప్రకారమే చర్యలు
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : మధిర రూరల్ ఎస్సై విశ్వతేజ
మధిర, ఆంధ్రప్రభ : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మధిర రూరల్ ఎస్సై అమర్లపూడి విశ్వతేజ స్పష్టం చేశారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం సాధారణ పౌరుల కోసం మాత్రమేనని, నేరస్తుల విషయంలో మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు.
అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, కోడిపందాలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు జరిగినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్న ఎస్సై విశ్వతేజ, సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
