కరీంనగర్‌లో శాంతిభద్రతలపై వినోద్ కుమార్ ఆగ్రహం
వరుస హత్యాయత్నాలు, దోపిడీలతో భయాందోళనలు..
పోలీసుల తీరుపై విమర్శలు.. బాధిత శ్రీకాంత్ కు పరామర్శ
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: కరీంనగర్ జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో శ్రీకాంత్ అనే యువకుడు కత్తి పోట్లకు గురైన సంగతి తెలిసిందే.. ఈ మేరకు బాధిత శ్రీకాంత్ ను వినోద్ కుమార్ పరామర్శించారు. అతడి ఆరోగ్య సమాచారంపై ఆరా తీశారు.
ఇటీవల కరీంనగర్‌లో నేరాలు పెరుగుతున్నా పోలీసులు తగిన స్థాయిలో స్పందించడం లేదని వినోద్ కుమార్ విమర్శించారు. నిఘా వ్యవస్థ వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కిసాన్‌నగర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిలో గాయపడిన బాధితుడిని బుధవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన.. వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంపై ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
