హెచ్ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం
అపోహలు వీడి వాస్తవాలు తెలుసుకోవాలి.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. హెచ్ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ముమ్మర ప్రచార కార్యక్రమం–2026లో భాగంగా బుధవారం నాగర్కర్నూల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీపై భయపడాల్సిన అవసరం లేదని, సరైన అవగాహనతో వ్యాధిని నివారించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు అనే విషయాలపై శాస్త్రీయ అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత హెచ్ఐవీపై సరైన సమాచారం తెలుసుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా వైద్య నిపుణులు, ఆరోగ్యశాఖ అందించే విశ్వసనీయ సమాచారాన్ని అనుసరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్, విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
