Lucknow Fire Tragedy | 11 మంది సజీవ దహనం
Lucknow Fire Tragedy | 11 మంది సజీవ దహనం
లక్నోలో ఘోర విషాదం.. భవనం నుంచి దూకిన విద్యార్థులు
మంటల్లో చిక్కుకున్న పలువురు.. సహాయక చర్యలు ముమ్మరం
Lucknow Fire Tragedy |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇవాళ సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అధికారుల వివరాల ప్రకారం.. భవనం దిగువ అంతస్తులో ఉన్న ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం అవి వేగంగా వ్యాపించి అదే భవనం రెండో అంతస్తులో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌ను చుట్టుముట్టాయి. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
పొగ, మంటల కారణంగా బయటకు వచ్చే మార్గాలు మూసుకుపోవడంతో కొందరు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నాలు కొనసాగించాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనతో లక్నో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతుండగా, గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
