జీవిత పాఠాలు

”మాతా శత్రు: పితా వైరీ యేన బాలోన పాఠిత: / న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా స‌. (హితోప దేశం-నారాయణ పండితుడు). ఏ బాలుడైతే అతని తల్లిదండ్రులచేత చదివింపబడడో అతడు సభలలో రాణించలేడు. ఎలాగంటే హంసల మధ్యన కొంగ శోభించలేదు కదా! అలాంటి విద్యా విహీనుడైన బాలునికి అతనిని చదివింపని తల్లిదండ్రులే శత్రువులు అని పై శ్లోకానికి అర్థం. విద్యాలయాలలో ఉపాధ్యాయ, అధ్యాపకులు ఎన్ని పాఠాలు బోధించినా, ఇంటి వద్ద బాల బాలికల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తమ పిల్లలను బాగా చదివించకపోతే ఆ పిల్లలు తప్పు దారిలోకి వెళ్ళే ప్రమాదముంది. సాధారణ పాఠ్యాం శాలతోబాటు తమ పిల్లలకు జీవిత పాఠాలు కూడా నేర్పాల్సిన బాధ్యత తల్లి దండ్రులకు ఉంది.
తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన జీవిత పాఠాలకు సంబంధించిన ఉదంతం ఒకటి 16 వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల నాటక కర్త, కవి, అయిన విలియం షేక్స్పియర్‌ వ్రాసిన ”హావ్లొట్‌” అనే నాటకంలో మనకు కన్పిస్తుంది. ఉన్నత చదువులకోసం ఇంగ్లాండ్‌ నుండి ఫ్రాన్స్‌ దేశానికి వెడుతున్న తన కొడుకు లెయర్టీజ్‌తో అతని తండ్రి పొలోనియస్‌ తన కొడుకు వ్యక్తి గత ప్రవర్తనకై ఫ్రాన్స్‌లో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి చెబుతాడు. ఆ బోధనలు సార్వకాలికము, సార్వజ నీకము అయినవి. తండ్రి పొలోనియస్‌ చెప్పిన మాటలు : ”మనసులోని ప్రతి ఆలోచనను బయట పెట్టకు. పరిపూర్ణత చెందని ఆలోచనను ఆచరణలో పెట్టకు. అందరితో సుపరిచితునిగా ఉండటం మంచిదే కానీ అది అనైతిక పద్ధతుల వలనకాక, మంచి పనుల ద్వారా జరగాలి. బాగా పరిశీలించి, పరీక్షించిన తర్వాతనే క్రొత్త వ్యక్తులతో స్నేహం చేయాలి. ఒక్కసారి మంచివ్యక్తితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నీ హృదయంలో ఇనుప సంకెళ్ళు వేసి బంధించి ఉంచుకోవాలి కానీ, చిన్న విషయాలకే స్నేహం చెడగొట్టుకో కూడదు. అయితే క్రొత్త మిత్రుని కోసం, అతనితో కలిసి వినోదించడం కోసం అనవసరంగా డబ్బు వృథా చేయరాదు. అప్పుడే పొదగబడి, పూర్తిగా ఎదగని పక్షి పిల్ల తనంత తానుగా స్వయంగా ఎగురలేదు. అలాంటిదే క్రొత్తగా ఏర్పడిన స్నేహ బంధం, మరియు బాగుగా పరీక్షింపబడని నూతన స్నేహితుడు. అలాగే తగాదాలలో, ఘర్షణలలో తల దూర్చరాదు. విధిలేక, తప్పనిసరి పరిస్థితులలో ఎవరితోనైనా ఘర్షణ పడవలసి వస్తే అప్పుడు అవతలి వ్యక్తి నిన్ను చూసి బెదరిపోయేలా ప్రవర్తించు. ఎవరైనా ఏదైనా విషయంపై నీతో మాట్లాడేటప్పుడు నీవు కేవలం వినడ ము మాత్రమే చేయాలి తప్ప, వెనువెం టనే నీ అభిప్రాయం చెప్పకూడదు. ప్రతి వ్యక్తి విమర్శను, అభిప్రాయాన్నీ వి నాలే కానీ, ఆ అంశంలోని న్యాయాన్యాయాల గురించి చర్చించకు. ఫ్రాన్స్‌ దేశము బాహ్య వేషధారణకు, సౌందర్యోప కరణాల వాడకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చే దేశం. కనుక అక్కడ నీ అలవాట్లను ఖరీదైన వాటిగా మలచుకోవాలి. అయితే ఆ ఖరీదైన అలవాట్లు నీ ఆర్థిక వనరులకు లోబడే ఉండాలని గుర్తుంచుకో ! నీ వస్త్రధారణ, అలవాట్లు నీ ఊహలలో ఉన్నట్లుగానో, ఆడంబరాన్ని ప్రదర్శించేలాగానో ఉండకూడదు. ధరించే వస్త్రాలు మనిషి యొక్క వ్యక్తి త్త్వానికి, సౌశీల్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. నీవు ఎవరికీ అప్పు ఇవ్వకు. ఎవరి దగ్గరా అప్పు చేయకు. ఎందుకంటే అప్పు అనేది ధనాన్నీ, స్నేహాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది కనుక. అప్పు అనేది నీ పొదుపును, ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నంచేసి, కళావిహీనుని చేస్తుంది. నీకు నీవు నిజాయితీగా, జవాబు దారిగా ఉండాలి. అప్పుడే, పగటిపూటను అనుసరించి వచ్చే రాత్రిలాగా, ఇత రుల పట్ల నీవు నిజాయితీగా ఉండగలవు. అలాగ నిన్ను నీవు తీర్చి దిద్దుకో!”. ఎంత చక్కని హితోపదేశం కదా !
ప్రతి తల్లి, తండ్రి, గురువు పిల్లలకు సందర్భం కలిగినప్పుడంతా మంచి వి షయాలను కథల, పాటల, పద్యాల రూపంలో చెబుతూ ఉంటే ఆ పిల్లల దృష్టి పబ్జిd గేములు, బెట్టింగ్‌ క్రీడలు, జూదం, మద్య ధూమపానాలు, గంజాయి సేవనం పట్ల మరలకుండా, నైతిక వర్తనం వైపు సాగుతుందని ఆశిద్దాం. యువత నిరాశ, నిస్పృహలకు లోనై ఆత్మహత్యల బారిన పడకుండా, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, సమాజానికి ప్రయోజనకరంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రయత్నిద్దాం.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply