చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..

  • పారదర్శకంగా కొనుగోళ్లు
  • రైతుల సంక్షేమమే ధ్యేయం
  • ప్రభుత్వ విప్ విజయ రమణ రావు

జూలపల్లి, ఆంధ్రప్రభ ; రైతులు కష్టించి పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ అభివృద్ధి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామరావు తెలియజేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌ను మరియు ఎలిగేడు మండలం దూళికట్ట సింగిల్ విండోలను అలాగే సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలో మక్కలు మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.జూలపల్లి కొనుగోలు కేంద్రం నుండి ఇప్పటివరకు దాదాపు 24 లారీల ధాన్యం తరలి వెళ్ళిందని, తాను స్వయంగా ఆ ట్రాక్షీట్లను, కాంటాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు.

ఏ ట్రాక్షీట్‌లో కూడా 41.100 లేదా 41.200 కిలోల కంటే ఎక్కువ బరువు వేయలేదని, తూకాలు పారదర్శకంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల రచ్చ కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కావాలని రచ్చ చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విజయరమణ రావు విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో జూలపల్లి మండలంలో రైతులు పడ్డ ఇబ్బందులు ఇక్కడి రైతులకు బాగా తెలుసన్నారు. ఈసారి హార్వెస్టర్లు ఎక్కువగా నడవడం, వరి కోతలు ఒకేసారి పూర్తికావడంతో పాటు దిగుబడి కూడా భారీగా పెరగడం వల్ల ధాన్యమంతా ఒకేసారి మార్కెట్‌కు వచ్చి కొంత ఇబ్బందిగా మారిందని, దీనిని రైతులు గమనించాలని కోరారు.

రైతులు కొంతవరకు ఏఈఓల వద్ద కాకుండా బయట నెంబర్లు వేయించుకోవడం, సరైన ఐడెంటిఫికేషన్ లేకుండా ధాన్యం తీసుకురావడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. మక్కల కొనుగోలు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని మొక్కజొన్న కొనుగోళ్లు కూడా పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తాము, రైస్ మిల్లర్లు, నాయకత్వం కలిసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో యంత్రాంగం శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖచ్చితంగా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోళ్ల విషయంలో చిన్న చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయాలు చేయడం తగదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి కటింగులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుపుతున్నట్టు చెప్పారు.