మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం

  • విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ: మాదక ద్రవ్యాల నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్ పేర్కొన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. సీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. డ్రగ్స్ పై వ్యతిరేకంగా విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ, డ్రగ్- ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ కార్యక్రమాలు, ప్రతి ప్రాంతంలో కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వంటివి చేపడతామన్నారు.

యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.