ఉమామహేశ్వర క్షేత్రానికి రవాణా సౌకర్యాల కొరత

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచినా, రవాణా సౌకర్యాల లేమితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం ఆలయానికి ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు కనీస బస్సు సౌకర్యం కూడా కల్పించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఉమామహేశ్వర క్షేత్ర పాలకమండలి కొండ దిగువ భాగం నుంచి కొండపైకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు భక్తులను కొండపైకి తీసుకువెళ్లి ఉచిత దర్శనం కల్పించి అనంతరం కొండ క్రిందకు తరలిస్తున్నారు. అయితే కొండ దిగువ ప్రాంతం వరకు చేరేందుకు మాత్రం ఎలాంటి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో భక్తులు పూర్తిగా ప్రైవేట్ ఆటోలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రంగాపూర్ గ్రామం నుంచి ఉమామహేశ్వరం కొండ దిగువ ప్రాంతం వరకు ఆటోలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు దొరుకుతాయో తెలియని పరిస్థితి ఉండడంతో భక్తులు గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సి వస్తోంది.
గురువారం దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమైన పలువురు భక్తులు దాదాపు గంటన్నర పాటు ఆటో కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో చిన్నపిల్లలు, లగేజీలను మోస్తూ మండుటెండలో కాలినడకన రంగాపూర్ గ్రామానికి బయలుదేరారు. ఈ దృశ్యాలు భక్తుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కిటకిటలాడే ఉమామహేశ్వర క్షేత్రానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. కనీసం రంగాపూర్ నుంచి ఉమామహేశ్వరం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని, పండుగలు, సెలవు దినాల్లో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భక్తుల ఇబ్బందులను గుర్తించి శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలని భక్తులు వేడుకుంటున్నారు.
