జైపాల్‌రెడ్డికి తుమ్మల యుగంధర్ నివాళి
జైపాల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం:
తుమ్మల యుగంధర్
ఖమ్మం, ఆంధ్రప్రభ : కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ ఎస్. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగంధర్ నివాళులర్పించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
దేశ రాజకీయాల్లో విలువలతో కూడిన పార్లమెంటరీ సంప్రదాయాలకు జైపాల్‌రెడ్డి ప్రతీకగా నిలిచారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ప్రజాసేవలో ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జైపాల్‌రెడ్డి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని తుమ్మల యుగంధర్ అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన జైపాల్‌రెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు.
జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన పార్లమెంటరీ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొని జైపాల్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు.
