అర్హుల ఓటు హక్కు కాపాడాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమం
జైనూర్, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు.
మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని లెండిగూడ, గౌరీ ముస్లింగూడ, గొండుగూడ, కోలంగూడ, షేకుగూడ, జాడుగూడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముఖీద్, మండల అధ్యక్షుడు షేక్ రషీద్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఓటరు డిజిటలైజేషన్ నమోదు శాతాన్ని పరిశీలించి, ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వంద శాతం నమోదు పూర్తి చేసేందుకు బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జాడుగూడ గ్రామంలో 26 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కాలేదని గుర్తించి, ఆ విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పెందుర్ ప్రకాశ్, నాయకులు మెస్రం అంబాజీ, భుజంగరావు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
