విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది
దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది:
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అచ్చంపేట, ఆంధ్రప్రభ: విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే బలమైన పునాది అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణతో కలిసి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సుమారు రూ.12 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని 7వ వార్డులో రూ.42 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించి దివ్యాంగులకు అంకితం చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో అచ్చంపేట నియోజకవర్గంలో 1,600 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశామని, అందులో 230 మంది దివ్యాంగులు కూడా లబ్ధి పొందారని గుర్తుచేశారు. దివ్యాంగులు శారీరకంగా బలహీనులు కావొచ్చు కానీ మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆదివాసీలకు నిర్మించిన తరహాలోనే దివ్యాంగులకు కూడా ప్రత్యేక గృహాలను నిర్మించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారికి అవసరమైన ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా రూ.42 లక్షలతో దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అలాంటి భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి దివ్యాంగులకు ప్రత్యేక గృహాల నిర్మాణం మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో దివ్యాంగులకు మరిన్ని వాహనాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కమ్యూనిటీ హాల్‌లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ గంగాపురం రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత మల్లేష్, అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ మురళి, సంబంధిత శాఖల అధికారులు, ఎస్టీ కార్పొరేషన్ ప్రతినిధులు, దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు కొడావత్ రవి, ఎన్పీఆర్‌డీ ఇండియా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు వి. రాజశేఖర్, ఎన్పీఆర్‌డీ తెలంగాణ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు శంకర్, దివ్యాంగుల కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు, పట్టణ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
