వెన్నుపోటు రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్

వెన్నుపోటు రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్

  • ఎంపీ కేశినేని శివనాథ్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వెన్నుపోటు, హత్య రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని శివనాథ్ ఆరోపించారు. పార్టీలో ఎవరు విభేదించినా వారిపై దాడులు, హత్య రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి వైసీపీలో నెలకొన్నదని విమర్శించారు. ఇటీవల వైసీపీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన నాయకులపైనా దాడులు జరిగిన ఘటనలను ప్రజలు చూశారని పేర్కొన్నారు.

వైసీపీ చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం పూర్తిగా రాజకీయ జిమ్మిక్ మాత్రమేనని కేశినేని శివనాథ్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్తామని ప్రకటించినప్పటికీ, గత రెండు రోజులుగా ఒక్క నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్లలేదని విమర్శించారు. నిజంగా ప్రజల మధ్యకు వెళ్తే ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ మహానాడును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిందని శివనాథ్ ఆరోపించారు. అయితే ఆ సమావేశానికి కనీసం 20 మంది నాయకులు కూడా హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా వైసీపీ నాయకులు ప్రజల్లో కనిపించడం లేదని, ప్రజాభిమానాన్ని పూర్తిగా కోల్పోయిన పార్టీగా వైసీపీ మారిందని అన్నారు.

రాష్ట్ర ప్రజలు వైసీపీ రాజకీయాలను పూర్తిగా తిరస్కరించారని కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధానాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

Leave a Reply