సామాజిక సేవలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆదర్శంగా నిలవాలి
కోదాడ, ఆంధ్రప్రభ : కాకతీయ కమ్మ సేవా సమితి సామాజిక సేవలో ఆదర్శంగా నిలవాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. కాకతీయుల కాలం నుంచే కమ్మ సామాజిక వర్గం చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి సేవా సంస్థలు కీలకంగా పనిచేయాలని, ముఖ్యంగా పేద మరియు బలహీన వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ చర్యల ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు.
కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించిన మంత్రి, ఈ భవనం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగే విధంగా సేవా సమితి కార్యక్రమాలు కొనసాగాలని సూచించారు. అనంతరం సమితి బాధ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సమితి నాయకులు, సభ్యులు, దాతలు, ప్రముఖులు పాల్గొన్నారు.
