పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
వికారాబాద్, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సుధాకర్ లాల్ తెలిపారు.
గురువారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో బూత్ బ్యానర్‌ను, పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వ్యాక్సిన్ ఇప్పటికే సరఫరా చేసినట్లు తెలిపారు.
పల్స్ పోలియో ప్రచార కార్యక్రమానికి సంబంధించిన బూత్ బ్యానర్లు, పోస్టర్లు, లాజిస్టిక్స్‌ను అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నామని వెల్లడించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య, డాక్టర్ నిఖిల్, డిప్యూటీ డెమో శ్రీనివాసులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
