సాకారమైన విశాఖ రైల్వే జోన్ కల…!
సాకారమైన విశాఖ రైల్వే జోన్ కల…!
జూన్ 1 నుండి ‘దక్షిణ తీర రైల్వే’ (ఎస్ సి ఓ ఆర్) కార్యకలాపాలు ప్రారంభం…
నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు.
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జూన్ 1 నుండి ‘దక్షిణ తీర రైల్వే’ (ఎస్ సి ఓ ఆర్) కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, దీంతో విశాఖ రైల్వే జోన్ కల సహకారం అయిందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. కొత్త జోన్ తో రైల్వే సదుపాయాలు ఏర్పాటుకు, యువతకు ఉపాధి, వాణిజ్యానికి ఊతం…అని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు కలను సాకారం చేస్తూ గెజిట్ ను విడుదల చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ..కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న “దక్షిణ తీర రైల్వే జోన్” కార్యకలాపాలు జూన్ 1 నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేస్తూ, మన రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిరంతరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్న గౌరవ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ జోన్ ఏర్పాటులో ముందడుగు పడిందని, కూటమిలోని పార్లమెంట్ సభ్యులందరం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైన వేళ అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ కొత్త జోన్ ద్వారా రైల్వే మౌలిక సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేసేందుకు, కొత్త రైళ్లు, స్టేషన్లలో హాల్ట్ లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆశాభావం వ్యక్తం చేశారు.
